ఒకసారి ఒక వ్యక్తి స్వామిజి దగ్గరికి వెళ్లి “స్వామి ఈ ప్రపంచం లో అన్నింటికన్నా గొప్పది ఏది? ” అని అడుగుతాడు.
స్వామిజి ఎందుకు అని ప్రశ్నించగా, “స్వామి ఈ ప్రపంచంలో ఎందరో దేవుళ్ళు ఉన్నారు, కానీ నేను అన్నింటి కన్నా గొప్పదాన్ని దేవుడిగా పూజిద్దామని అనుకుంటున్నాను” అని చెప్తాడు. అప్పుడు స్వామిజి “ఒక విగ్రహాన్ని ఇచ్చి దీన్ని పూజించు” అని అంటారు.
మరుసటి రోజు నుంచి అతను ఆ విగ్రహానికి పూజలు చేసి, నైవేద్యం సమర్పిస్తాడు. ఒక రోజు ఒక ఎలుక నైవేద్యాన్ని తింటూండడాన్ని గమనిస్తాడు. ఈ ఎలుక విగ్రహానికి పెట్టిన నైవేద్యం తినింది అంటే అది విగ్రహానికన్నా శక్తివంతమైనదని భావించి మరుసటి రోజు నుంచి విగ్రహాన్ని వదిలి ఎలుకని పూజిస్తాడు.
ఆ రోజు నుంచి ఎలుక కన్నం దగ్గర పిండి పదార్దాలు ఉంచి , అవి తినడానికి ఎలుక వచ్చినపుడు ఆ ఎలుక ముందు సాష్టాంగపడేవాడు.
అలా కొన్ని రోజులు గడిచాక, ఆ ఎలుకను ఒక పిల్లి నోట కరుచుకొని వెళ్ళడం చూసాడు. అప్పటి నుంచి పిల్లిని కొలవడం ప్రారంభించాడు. ఆ పిల్లి ఒక రోజు వంటింట్లో పాలు తాగుతుంటే తన భార్య తరమడం చూసి “తన భార్యే అందరి కన్నా గొప్పది” అనుకుని, ఆమెను పూజించడం ప్రారంభించాడు. అది ఆమెకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ ఆమె సంతోషం కూడా ఎక్కువ రోజులు లేదు.
ఒక రోజు ఆమె పప్పుచారులో ఉప్పు వేయడం మర్చిపోయింది అంతే ఆమె మీద ఇంతెత్తున లేచాడు దానికి ఆమె భయపడడంతో, ఆమె కన్నా తాను ఇంకా గొప్పవాడిని అనుకుని “తనను తాను పూజించుకోవడం” ప్రారంభిస్తాడు. రోజు తనకి తాను పూజ చేసుకోవడం, వివిధ రకాలైన నైవేద్యాలు సమర్పించుకుని తినడం చేస్తూ ఉండేవాడు.
కొన్నిరోజులు అయ్యాక అతను మరణించాడు, అతనితో పాటు ఆ “దేవుడు మరణించాడు”.
Advertisements