ఒకసారి ఒక గుడ్లగూబ చెట్టు మీద కూర్చుని తింటూవుండగా , ఒక తుంటరి పిల్లవాడు మట్టి ముద్ద ఒకటి దాని మీదకి విసురుతాడు. అది గుడ్లగూబని సూటిగా, బలంగా తాకింది. బాధతో అది ఏడ్చుకుంటూ సహాయం కోసం తన స్నేహితుడైన కాకి దగ్గరకి వెళ్తుంది. 
 
ఆ కాకి, గుడ్లగూబని వైద్యుడైన కోకిల దగ్గరకి తీసుకువెళ్తుంది. కోకిల గుడ్లగూబను పరీక్షించి దాని బాధకి కారణం మట్టి ముద్ద అని గ్రహించి “మెడ లోతున్న నీళ్ల గుంటలో ఒక గంట సేపు కూర్చో” అని సలహా ఇచ్చింది. 
 
గుడ్లగూబ అలానే చేసి నొప్పి తగ్గించుకుని ఎగిరిపోతుంటే, కోకిల “ఫీజు సంగతేంటి” అని అడుగుతుంది. నీళ్ళ వల్ల నొప్పి తగ్గింది కాబట్టి, నీకు ఫీజు ఇవ్వను అని అంటుంది. కాకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది, అయినా గుడ్లగూబ ఫీజు ఇవ్వక పోయేసరికి కోకిల న్యాయాధికారి అయిన కుందేలు దగ్గరికి ఆ ఇద్దరినీ తీసుకువెళ్తుంది. 
 
“నేను దివాళా తీసాను నా దగ్గర డబ్బు లేదు, నేను ఫీజు ఇవ్వలేను” అని చేతులెత్తేస్తోంది గుడ్లగూబ.
 
గుడ్లగూబకి జవాబుదారీతనంగా ఉన్నావు కాబట్టి ఆ ఫీజు నువ్వే కట్టాలి అని కాకిని అంటుంది కుందేలు. 
 
అప్పుడు కాకి ” నా దగ్గర అంత డబ్బు లేదు నేను రోజువారీ పని చేసుకునే వాడిని, నేను కట్టలేను అని అంటుంది.”
 
అప్పుడు కుందేలు “అయితే నువ్వు కోకిలకు సేవ చేసి ఋణం తీర్చుకో. కోకిల గుడ్లు పొడగబడే వరకు నువ్వు కాపలాగా ఉండు” అని తీర్పు ఇస్తుంది.
Advertisements