ముగ్గురు యాత్రికులు తమ యాత్రలో కొన్నాళ్లకు, బాగా సన్నిహితులయిపోయారు. ఒక రోజు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి, ఒక దగ్గర కూర్చుని వారి వారి అనుభవాల్ని, చెప్పుకుంటూ సేదతీర్చుకున్నారు.
అలసట మీద ఆకలి కూడా ఎక్కువైంది. ఉన్న రొట్టెలు ముగ్గురికి సరిపోవు. అయినా ఎవరికి వాళ్ళకే అవి తినేయాలని ఆరాటం మొదలయింది. కాస్సేపటికి నేనంటే నేను అని కొట్టుకునే వరకూ పోయింది.
అంతలోనే ఇదేమీ బాగోలేదని అందరూ కలిసి ఒక నిర్ణయానికొచ్చారు.
ఇప్పటికి నీళ్లు తాగి నిద్రపోదాం. నిద్రలో ఎవరికి మంచి కల వస్తే వారికే  ఆ రొట్టెలు అని.అలాగే నిద్రపోయి లేచి ఎవరి కలల్ని వారు చెప్పుకున్నారు.
మొదటివాడు “తన కలలో అద్భుతమైన నగరాన్ని అందమైన ప్రదేశాల్ని చూసానని వర్ణనలతో సహా చెప్పాడు. ఆఖరికి ఎవరో పెద్ద మనిషి తన పుట్టు పూర్వోత్తరాల మూలంగా ఆ రొట్టె తనకే చెందాలని చెప్పాడని కూడా చెప్పుకున్నాడు.”
రెండవవాడు “తన కలలో తన గతాన్ని, భవిష్యత్తుని రెంటినీ చూసానని, ఒక జ్ఞాని కనపడి ఆ రొట్టె తనకే చెందాలని చెప్పాడని గర్వంగా అన్నాడు.”
మూడవ వాడు “తన కలలో ఏమి చూడలేదని, వినలేదని…  కానీ ఏదో అదృశ్యశక్తి తనను ప్రేరేపించి ఆ రొట్టెను తీసుకుని తినేట్టు చేసిందని చెప్పాడు. “
మొదటి ఇద్దరూ కోపంతో ఊగిపోయారు. ఆ అదృశ్యశక్తి మమ్మల్ని లేపమని చెప్పలేదా అని కోపంగా అరిచారు.
“చెప్పకేం… అలాగే ప్రయత్నం చేసాను, కాని మీరెక్కడో అద్భుతమైన నగరంలోనే, గతంలోనే ,భవిష్యత్తులోనో చాలా దూరంగా ఉన్నారు. వినిపించలేదనుకుంటా…” అని ,
హా … నాకు ఇంకా నిద్ర వస్తుంది అని చక్కగా నిద్రపోయాడు.
Advertisements