ఒకసారి ఒక ధనవంతుడు తన వరహాల సంచిని పోగొట్టుకుంటాడు. అందులో రెండువేల వరహాలు ఉన్నాయి.
“ఆ సంచి తెచ్చి ఇచ్చిన వారికి వెయ్యి వరహాలు బహుమతిగా ఇస్తా” అని ప్రకటించాడు.
ఆయన దగ్గర పనిచేసే నౌకరులలో ఒకరికి ఆ మూట దొరుకుతుంది. అతడు దానిని తీసుకువచ్చి ఆ ధనవంతుడికి అందచేసి ‘తన బహుమతిని ఇవ్వమని’ అడుగుతాడు. కానీ ఆ ధనవంతుడికి చూస్తూ వెయ్యి వరహాలు ఇవ్వడానికి మనసొప్పలేదు.
“ఆ సంచిలో విలువైన వజ్రం ఒకటి ఉండాలి. అది కనపడడం లేదు, అది కూడా ఇస్తేనే నీ బహుమతి నీకు ఇస్తాను” అని మెలిక పెడతాడు.
చేసేదేమిలేక అతడు న్యాయాధికారికి ఫిర్యాదు చేస్తాడు. అధికారికి ధనవంతుడి దుర్బుద్ధి అర్ధమవుతుంది. వెంటనే ఆ ధనవంతుడుని పిలిపించి “నువ్వు పోగొట్టుకున్న సంచిలో రెండు వేళ వరహాలతో పాటు ఒక వజ్రం ఉండాలి, అవునా?” అని అడుగుతాడు న్యాయాధికారి.
“అవునండి” అని సమాధానమిస్తాడు ధనవంతుడు.
“అయితే, అందులో వజ్రం లేదు కాబట్టి ఆ సంచి నీది కాదు అన్నమాట. అది అతనికి తిరిగి ఇచ్చేయ్, నిజంగా ఆ సంచి పోగొట్టుకున్న వ్యక్తి వచ్చే అంతవరకు అది అతని దగ్గరే ఉంటుంది” అని తీర్పు ఇస్తాడు న్యాయాధికారి.
దానితో మొదటికే మోసం వస్తుంది అని ధనవంతుడికి తెలిసివచ్చి, “తప్పయిపోయింది” అని లెంపలేసుకుని, అన్న మాట ప్రకారం వెయ్యి వరహాలు ఆ నౌకరుకు ఇస్తాడు. కనీసం సగమన్నా దక్కినందుకు తృప్తిపడుతూ.
Advertisements