కొత్త ఏడాది జనవరి వచ్చింది కదా?..మరి ఉగాది ఎలా కొత్త సంవత్సరం అయ్యింది??
ఆంగ్లంలో నెలల పేర్లు చెప్పమంటే జనవరి,ఫిబ్రవరి అంటూ చెపుతాం.. మరి తెలుగు నెలలు వేరే ఉన్నాయి అవి చైత్రం నుంచి ఫాల్గుణం వరకు.
కాలాన్ని కొలవడంలో వేరు-వేరు పద్ధతులు ఉపయోగించడం వల్ల ఈ తేడాలు. సూర్యుని గమనం ఆధారంగా సౌరమానం, చంద్రుని గమనం ఆధారంగా చాంద్రమానం.
చాంద్రమానం ప్రకారం ఫాల్గుణ మాసం పూర్తయ్యాక తిరిగి చైత్రమాసం వస్తుంది. ఆ తోలి రోజునే “ఉగాది”గా జరుపుకుంటాం.

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడని నమ్ముతారు. మత్స్యావతారం  ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. . అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాథ.

“ఉగాది”, మరియు “యుగాది” అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. “ఉగ” అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ‘ఆది’ ‘ఉగాది’.అంటే సృష్టి ఆరంభమైనదినమే “ఉగాది”. ‘యుగము’ అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే అయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.

 ఉగాది పచ్చడి

“ఉగాది పచ్చడి” ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్థం.షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

Advertisements