ఒక పర్యాటకుడు దేశాటన చేస్తూ సాయంత్రం వేళకి ఒక సన్యాసుల ఆశ్రమం చేరుకుంటాడు. వారు అతిధి మర్యాదలు బాగా తెలిసినవారు. అతనికి భోజన ఏర్పాట్లు చెయ్యడంతో పాటు పడుకోవడానికి శయ్యను కూడా ఏర్పాటు చేస్తారు.
అర్ధరాత్రి వేళ అతనిని ఎవరో లేపినట్లు అనిపిస్తుంది, ఒక అలౌకికమైన శబ్దం వినిపిస్తుంది..ఒక్కసారిగా ఒళ్ళు జలదరిస్తుంది. కాసేపటి తర్వాత ఆ శబ్దం ఆగిపోతుంది.
తెల్లవారుజామున తాను విన్న శబ్దం గురించి సన్యాసులను అడుగగా వారు “మేము నీకు చెప్పలేము ఎందుకంటే నువ్వు సన్యాసివి కాదు కదా?” అని అంటారు.
ఆ శబ్దం గురించే ఆలోచిస్తూ తన దారిన వెళ్ళిపోతాడు ఆ పర్యాటకుడు.
కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆశ్చర్యంగా అతను మళ్ళీ సాయంత్రం వేళకి ఆ ఆశ్రమం చేరుకుంటాడు. యధావిధిగా ఆ సన్యాసులు అతనికి భోజన వసతి సదుపాయాలు సమకూరుస్తారు.
ఆ రోజు కూడా అర్థరాత్రి సమయాన అతనికి ఒక అతీతమైన శబ్దం వినిపిస్తుంది, రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఆ శబ్దం గురించి ఆ సన్యాసులను మళ్ళీ ప్రశ్నించగా వారు మళ్ళీ “మేము నీకు చెప్పలేము ఎందుకంటే నువ్వు సన్యాసివి కాదు కదా” అని అంటారు.
“ఆ శబ్దం ఏమిటో తెలుసుకునే దాక నాకు మనఃశాంతి ఉండదు, ఒకవేళ అది తెలుసుకోవడానికి నేను సన్యాసిని కావడమే మార్గం అయితే నేను ఇప్పుడే సన్యాసిని అవుతాను, ఏం చెయ్యమంటారో చెప్పండి” అని అంటాడు ఆ పర్యాటకుడు.
“నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నింటిని దానం చేసి కట్టుబట్టలతో రావాలి” అని అంటారు ఆ సన్యాసులు.
అలా చేసిన తర్వాత ఆ పర్యాటకుడికి సన్యాసి వస్త్రాలు ధరింపచేసి తమలో ఒకడిగా కలుపుకుంటారు.
“కనపడుతున్న ఆ ద్వారంగుండా వెళ్ళు నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది” అని ఆ పర్యాటకుడిని ఒక గదిలోకి పంపిస్తారు.
అక్కడ ఒక రాతి ద్వారం కనిపించింది. అది తెరుచుకుని ముందుకు వెళితే ఒక స్పటిక ద్వారం కనిపించింది. అది తెరుచుకుని ముందుకు వెళితే ఒక వెండి ద్వారం కనిపించింది. అక్కడ ఆ శబ్దానికి కారణం ఏమిటో తెలిసింది. ఒక్కసారిగా భయంవేసింది, పారిపోదామని ప్రయత్నించినా కుదరలేదు.. అక్కడ అతను ఏమి చూసాడంటే??
“క్షమించండి మీకు ఆ రహస్యం చెప్పడానికి వీలు లేదు, ఎందుకంటే మీరు సన్యాసులు కాదు కదా”.
Advertisements