మూడు వడపోతల పరీక్ష పూర్వం గ్రీకు దేశం లో సోక్రటీస్ అనే ఒక మేధావి ఉండేవాడు. జ్ఞాన సముపార్జనలో ఆయనకు ఆయనే సాటి. ఒక రోజు ఒక అపరిచితుడు ఆయనతో “మీకు తెలుసా, మీ స్నేహితుడు ఏం చేసాడో? తన గురించి అందరూ ఏం మాట్లాడుకుంటున్నారో?,నేను ఏం విన్నానో చెప్పనా ” అని చెపుతూ ఉంటాడు. “ఒక్క నిమిషం ఆగు” , నా స్నేహితుని గురించి నువ్వు చెప్పేది నేను వినే ముందు “నువ్వు విన్న మాటలకి చిన్న పరీక్ష పెడదాం”. అని అంటారు సోక్రటీస్. దాని పేరే “మూడు వడపోతల పరీక్ష”.

మొదటిది – నిజం : “నువ్వు నా స్నేహితుని గురించి చెప్పేది నూటికి నూరు శాతం నిజామా?” “ఆ…లేదు,ఎవరో చెప్పగా విన్నాను” అని అంటాడు ఆ అపరిచితుడు. “పర్లేదు.. నువ్వు చెప్పబోయేది నిజం కాకపోయిన, ఇంకొక వడపోత పెడదాం నువ్వు చెప్పే విషయానికి” అని ఆ సంభాషణని కొనసాగిస్తాడు సోక్రటీస్

రెండవది – మంచి : “నువ్వు నా స్నేహితుని గురించి ఏమైనా మంచిగా చెప్పబోతున్నావా?” “మ్.. లేదు నేను చెప్పబోయేది, “నీ స్నేహితుని గురించి చెడు” అని అపరిచితుని సమాధానం. “ఓహో! ..నువ్వు నా స్నేహితుని గురించి చెడుగా చెప్పాలనుకుంటున్నావు, పైగా అది నిజం కాదు”… అయినా, పర్లేదు నువ్వు చెప్పే విషయానికి చివరగా ఇంకొక వడపోత పెడదాం.

మూడవది – ఉపయోగం : “నువ్వు చెప్పే విషయం ఎవరికైనా ఉపయోగపడుతుందా?” “నిజం, చెప్పాలంటే లేదు అది ఎవరికి ఉపయోగపడదు” అని నెమ్మదిగా చెప్తాడు ఆ అపరిచితుడు. “బాగుంది.. నువ్వు చెప్పేది నిజం కాదు, మంచిది కాదు, పైగా ఎవరికీ ఉపయోగపడదు.. అలాంటపుడు నువ్వు చెప్పేది నేను ఎందుకు వినాలి అని ప్రశ్నిస్తాడు సోక్రటీస్.. మనం కూడా ఇలానే బయటి వారు చెప్పే మాటలకు ఈ చిన్న పరీక్షని ఉపయోగిస్తే..మన స్నేహితులు, బంధువులు,ఆప్తుల పైన అనుమానాలు, అపోహలు ఉండవు కదా!..

Advertisements