(యండమూరి వీరేంద్రనాథ్ చెప్పిన కథలలోని అద్భుతమైన కథ)

వింధ్యారణ్య ప్రాంతంలో పులులు గుంపులుగా వచ్చి ఆవుల్నీ, గేదెల్నీ పొట్టన పెట్టుకుంటున్నప్పుడు, గిరిజనులు వెళ్లి ద్రోణాచార్యుణ్ని శరణు వేడారు. ముందుగా ఆయన ధర్మరాజును పంపాడు. అతడు వెళ్లి కొన్నిటిని చంపి, మిగతా వాటిని పారద్రోలాడు. గిరిజనులు సంతోషించారు కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. నెల తిరిగేసరికి ఆ క్రూర మృగాలు మరింత పెద్ద గుంపుగా వచ్చి గ్రామం మీద పడ్డాయి. ఈ సారి ద్రోణుడు భీముణ్ని పంపాడు. అతడి ఆయుధం ప్రపంచంలోకెల్లా గొప్ప ఆయుధాల్లో ఒకటైన గద..! అయితే అది చురుకైన పులుల మీద ఏ ప్రభావమూ చూపించలేక పోయింది. అప్పుడు అర్జునుణ్ని పంపగా, అతను వెళ్లి తన విలువిద్యా నైపుణ్యంతో అన్ని పులుల్నీ చంపి వచ్చాడు. అయితే ఏడాది తిరిగేసరికి యవ్వనంతో బలసిన తరువాతి తరం పులులు గ్రామం మీద భయంకరంగా దాడి చేశాయి. ద్రోణుడు ఈసారి ఆఖరి ఇద్దర్నీ పంపించాడు.

నకులసహదేవులు వెంటనే రంగంలోకి దిగలేదు. ముందు గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గ్రామం చుట్టూ కందకాలు తవ్వించే పని నకులుడు చేపడితే, సహదేవుడు పులులతో ఎలా యుద్ధం చేయాలో గ్రామస్థులకు నేర్పి సంసిద్ధం చేశాడు. ఈసారి పులులు దండెత్తినప్పుడు గ్రామస్థులే ధైర్యంగా ఎదుర్కొని ఏ మాత్రం ప్రాణ నష్టం లేకుండా వాటిని తరిమికొట్టారు. తిరిగివచ్చిన నకులసహదేవుల్ని ‘‘ఇది నిశ్చయంగా మీ విజయం’’ అంటూ ద్రోణుడు పొగిడాడు. ఈ కథ రెండు సూత్రాల్ని చెబుతుంది. 1. ఒక సమస్య తాలూకు కొమ్మల్ని కత్తిరిస్తే, తాత్కాలిక విజయం దొరుకుతుందేమో తప్ప పరిష్కారం దొరకదు. మీలో మీరు ఎంతకాలం ఇలా కుమిలిపోయినా పరిష్కారం దొరకదు. 2. సమస్యని ఎదుర్కోవడానికి ముందు దాన్ని నిశితంగా పరిశీలించి, ఏ ఆయుధం వాడాలో తెలుసుకుంటే మీ సమస్య సగం తీరినట్టే. మన ఆయుధం ఎంత గొప్పదైనా, అది సమస్యను పరిష్కరించేదిగా ఉండాలే తప్ప కేవలం గొప్పదిగా ఉన్నంత మాత్రాన లాభం లేదు.

Advertisements